Monday, March 07, 2016

నైమిశారణ్య వర్ణనము

1-36. కందము
పుణ్యంబై మునివల్లభగణ్యంబై కుసుమఫలనికాయోత్థిత సా 
ద్గుణ్యమయి నైమిశాఖ్యారణ్యంబు నుతింపఁదగు సరణ్యంబులలోన్.  

1-37. వచనము

మఱియును; మధువైరి మందిరంబునుం బోలె మాధవీమన్మథమహితంబై; బ్రహ్మగేహంబునుం బోలె శారదాన్వితంబై; నీలగళసభా నికేతనంబునుం బోలె వహ్ని, వరుణ, సమీరణ, చంద్ర, రుద్ర, హైమవతీ, కుబేర, వృషభ, గాలవ, శాండిల్య, పాశుపత జటిపటల మండితంబై; బలభేది భవనంబునుం బోలె నైరావతామృత, రంభా గణికాభిరామంబై; మురాసురు నిలయంబునుం బోలె నున్మత్తరాక్షసవంశ సంకులంబై; ధనదాగారంబునుం బోలె శంఖ, పద్మ, కుంద, ముకుంద సుందరంబై; రఘురాము యుద్ధంబునుంబోలె నిరంతర శరానలశిఖాబహుళంబై; పరశురాము భండనంబునుం బోలె నర్జునోద్భేదంబై; దానవ సంగ్రామంబునుం బోలె నరిష్ట, జంభ, నికుంభ శక్తియుక్తంబై; కౌరవసంగరంబునుం బోలె ద్రోణార్జున కాంచనస్యందనకదంబ సమేతంబై; కర్ణుకలహంబునుం బోలె మహోన్నతశల్యసహకారంబై; సముద్రసేతుబంధనంబునుం బోలె నల, నీల, పనసాద్యద్రి ప్రదీపింతంబై; భర్గుభజనంబునుం బోలె నానాశోకలేఖా ఫలితంబై; మరుని కోదండంబునుం బోలెఁ బున్నాగశిలీముఖ భూషితంబై; నరసింహ రూపంబునుం బోలెఁ గేసరకరజకాంతంబై; నాట్యరంగంబునుం బోలె నటనటీ సుషిరాన్వితంబై; శైలజానిటలంబునుం బోలెఁ జందన, కర్పూర తిలకాలంకృతంబై; వర్షాగమంబునుం బోలె నింద్రబాణాసన, మేఘ, కరక, కమనీయంబై; నిగమంబునుం బోలె గాయత్రీ విరాజితంబై; మహాకావ్యంబునుం బోలె సరళ మృదులతా కలితంబై; వినతానిలయంబునుం బోలె సుపర్ణ రుచిరంబై; యమరావతీపురంబునుం బోలె సుమనోలలితంబై; కైటభోద్యోగంబునుం బోలె మధుమానితంబై; పురుషోత్తమ సేవనంబునుం బోలె నమృతఫలదంబై; ధనంజయ సమీకంబునుం బోలె నభ్రంకష పరాగంబై; వైకుంఠపురంబునుం బోలె హరి, ఖడ్గ, పుండరీక విలసితంబై; నందఘోషంబునుం బోలెఁ గృష్ణసార సుందరంబై; లంకా నగరంబునుం బోలె రామమహిషీవంచక సమంచితంబై; సుగ్రీవ సైన్యంబునుం బోలె గజ, గవయ, శరభ శోభితంబై; నారాయణస్థానంబునుం బోలె నీలకంఠ, హంస, కౌశిక, భరద్వాజ, తిత్తిరి భాసురంబై; మహాభారతంబునుం బోలె నేకచక్ర, బక, కంక, ధార్తరాష్ట్ర, శకుని, నకుల సంచార సమ్మిళితంబై; సూర్యరథంబునుం బోలె నురుతర ప్రవాహంబై; జలదకాల సంధ్యా ముహూర్తంబునుం బోలె బహువితత జాతిసౌమనస్యంబై యొప్పు నైమిశారణ్యం బను శ్రీవిష్ణుక్షేత్రంబు నందు శౌనకాది మహామునులు స్వర్లోకగీయమానుం డగు హరిం జేరుకొఱకు సహస్రవర్షంబు లనుష్ఠానకాలంబుగాఁ గల సత్త్రసంజ్ఞికం బైన యాగంబు సేయుచుండి; రం దొక్కనాఁడు వారలు రేపకడ నిత్యనైమిత్తిక హోమంబు లాచరించి సత్కృతుండై సుఖాసీనుండై యున్న సూతునిం జూచి.  

మునుపటి తదుపరి


Friday, March 04, 2016

1-35 వేదకల్పవృక్షవిగళితమై

తేటగీతి 
పరఁగ నాధ్యాత్మికాది తాపత్రయంబు, నడఁచి పరమార్ధభూతమై యఖిల సుఖద
మైసమస్తంబుగాకయు నయ్యునుండు, వస్తువెఱుగంగఁ దగుభాగవతమునందు.

1-35. ఆటవెలది
వేదకల్పవృక్షవిగళితమై శుక, ముఖసుధాద్రావమున మొనసియున్న
భాగవతపురాణ ఫలరసాస్వాదన, పదవిఁ గనుడు రసిక భావవిదులు.


* * *

1-34 శ్రీమంతమై

1-34. సీసము  

శ్రీమంతమై మునిశ్రేష్ఠకృతంబైన భాగవతంబు సద్భక్తితోడ 
వినఁగోరువారల విములచిత్తంబులఁ జెచ్చెర నీశుండు చిక్కుఁ గాక 
యితర శాస్త్రంబుల నీశండు చిక్కునె మంచివారలకు నిర్మత్సరులకు 
గపటనిర్ముక్తులై కాంక్ష సేయక యిందుఁ దగిలియుందుట మహాతత్వబుధ్ధి


* * *

1-33 వచనము

1-33. వచనము 

ఇట్లు "సత్యం పరం ధీమహి" యను గాయత్రీ ప్రారంభున గయత్రీనామ బ్రహ్మరూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రి నదికరించి ధర్మవిస్తరంబును వృత్రాసుర వధంబును నెందుఁ జెప్పంబడు నదియ భాగవతంబని పలుకుటం జేసి యీ పురాణంబు శ్రీ మహాభాగవతంబున నొప్పుచుండు. 

* * *

1-32 విశ్వజన్మస్థితి

1-32. సీసము
విశ్వజన్మస్థితి విలయంబు లెవ్వనివలన నేర్పడు ననువర్తమున
వ్యావర్తనమునఁ గార్యములం దభిజ్ఞుఁడై తాన రాజగుచుఁ జిత్తమునఁ జేసి
వేదంబు లజునకు విదితముల్ గావించె నెవ్వఁడు బుధులు మోహింతు రెవ్వ
నికి నెండమావుల నీటఁ గాచాదుల నన్యోన్యబుధ్ధి దా నడరునట్లు

ఆటవెలది 
త్రిగుణసృష్టి యెందు దీపించి సత్యము, భంగిఁ దోఁచు స్వప్రభానిరస్త
కుహకుఁ డెవ్వఁ డతనిఁగోరి చింతించెద, ననఘు విశ్వమయుని ననుదినంబు.


* * *

షట్యంతములు

1-27. ఉత్పలమాల
హారికి నందగోకుల విహారికి జక్రసమీరదైత్య సం
హారికి భక్త దుఃఖపరిహారికి గోపనితంబినీ మనో
హారికి దుష్టసంప దపహారికి ఘోషకుటీపయోఘృతా
హారికి బాలకగ్రహమహాసురదుర్వనితా ప్రహారికిన్.

1-28. ఉత్పలమాల
శీలికి నీతిశాలికి వశీకృతశూలికి బాణహస్తిని
ర్మూలికి ఘోరనీరదవిముక్తశిలాహత గోపగోపికా
పాలికి వర్ణధర్మ పరిపాలికి నర్జునభీజయుగ్మ సం
చాలికి మాలికిన్ విపుల చక్రనిరుద్ర మరీచిమాలికిన్.

1-29. ఉత్పలమాల
క్షుంతకుఁ గాళియోరగ విశాల ఫణోపరివర్తన క్రియా
రంతకు నుల్ల సన్మగధరాజ చతుర్విధఘోర వహినీ
హంతకు నింద్రనందననియంతకు సర్వచరాచరావళీ
మంతకు నిర్జితేంద్రియసమంచిత భక్తజనానుగంతకున్.

1-30. ఉత్పలమాల
న్యాయికి భూసురేంద్రమృతనందనదాయికి రుక్మిణీ మన
స్థాయికి భూతసమ్మద విధాయికి సాధు జనానురాగ సం
ధాయికిఁ బీతవస్త్ర పరిధాయికిఁ బద్మభవాండ భాండ ని
ర్మాయికి గోపికానివహమందిరయాయికి శేషశాయికిన్.

వచనము.
సమర్పితంబుగా నే నంధ్రభషను రచయింపబూనిన శ్రీమహాభాగవతంబునకుంబ్రారంభం బెట్టిదనిన:


* * *


గ్రంధకర్తృ వంశవర్ణనము

1-22. సీసము
కౌండిన్యసగోత్ర సంకలితుఁడాపస్తంబసూత్రండు పుణ్యుండు సుభగుఁడైన
భీమన మంత్రికిఁబ్రియపుత్రుఁడన్నయ కలకంఠి తద్భార్య గౌరమాంబ
కమలాప్తు వరమునఁగనిన సోమనమంత్రి వల్లభ మల్లమ వారి తనయు
డెల్లిన యతనికి నిల్లాలు మాచమ వారి పుత్రుఁడు వంశ వర్ధనుండు

ఆటవెలది
లలిత మూర్తి బహుకళానిధి కేసన, దానమాననీతిధనుఁడు ఘనుడు
తనకు లక్కమాంబ ధర్మగేహిని గాఁగ, మనియె శైవశాస్త్రమతము గనియె

1-23. కందము
నడవదు నిలయము వెలువడి, తడవదు పర పురుషు గుణము దనపతి నొడుపున్
గడవదు వితరణ కరుణలు, విడువదు లక్కంబ విబుధ విసరమువొగడన్

1-24. ఉత్పలమాల
మానిను లీడుగారు బహుమాన నివారిత దీనమానస
గ్లానికి దానధర్మ మతిగౌరవ మంజులతాభీరతా
స్థానికి ముద్దసానికి సదాశివపాదయుగార్చనానుకం
పానయ వాగ్భవానికిని బమ్మెర కేసయ లక్కసానికిన్

1-25. కందము
ఆమానిని కుదయించితి, మేమిరపుర మగ్రజాతుఁడీశ్వర సేవా
కాముఁడు తిప్పయ; పోతయ నామవ్యక్తుండ సాధునయయుక్తుండన్

1-26. వచనము
అయిన నేను నా చిత్తంబునఁ బెన్నిధానంబునుం బోని శ్రీరామచంద్రుసన్నిధానంబుఁగల్పించుకొని





* * *

1-21 వచనము

1-21. వచనము

ఇట్లు భాసిల్లెడు శ్రీమహాభాగవతపురాణ పారిజాతపాదప సమాశ్రయంబున హరి కరుణావిశేషంబునఁ గృతార్ధత్వంబు సిధించెనని బుధ్ధినెఱింగి లేచి మరలి కొన్ని దినంబులను నేకశిలానగరంబునకుం జనుదెంచి యందు గురువృధ్ధబుధ బంధు జనానుజ్ఞాతుండనై.

* * *

1-20 లలితస్కంధము

1-20. మత్తేభము

లలితస్కంధము గృష్ణమూలము శూకాలపాభిరామంబు మం
జులతా శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరో
జ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్విజశ్రేయమై


* * *

1-19 ఒనరన్

1-19. మత్తేభము

ఒనరన్ నన్నయ తిక్కనాదికవు లీ యుర్విం బురణావళుల్
తెనుఁగుల్ సేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో
తెనుఁగుం జేయరు మున్న భాగవతమున్ దీనిన్ దెనింగించి నా
జననంబున్ సఫలంబు చెసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్

* * *

1-18 కొందఱికిఁదెనుఁగు

1-18. కందము

కొందఱికిఁదెనుఁగు గుణమగుఁ, గొందఱికిని సంస్కృతంబుగుణమగు రెండున్
గొందఱికి గుణములగు నే, నందఱి మెప్పింతుఁ గృతుల నయ్యైయెడలన్
* * *

1-17 భాగవతము దెలిసి

1-17. ఆటవెలది

భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు, శూలికైనఁ దమ్మిచూలికైన
విబుధ జనులవలన విన్నంత కన్నంత, తెలియ వచ్చినంత తేటపఱుతు  

* * * 

1-16 పలికెడిది

1-16. కందము


పలికెడిది భాగవతమఁట, పలికించువిభుండు రామభద్రుండఁట నేఁ
బలికిన భవహరమగునఁట, పలికెద వేఱొండుగాథఁ బలుకఁగ నేలా.

* * *

1-15 పుండరీక

1-15. ఆటవెలది

పుండరీక యుగముఁబోలు కన్నులవాఁడు, వెడఁద యురమువాఁడు విపులభద్ర
ముర్తి వాఁడు రాజముఖ్యుఁడోక్కరుఁడునా, కన్నుఁగవకు నెదురఁగానబడియె


వచనము
ఏ నా రాజశేఖరునిం దేఱిచూచి భాషింప యత్నంబు సేయునెడనతండు దా రామభద్రుండ మన్నమంకితాంబుగ శ్రీ మహాభాగవతంబుఁ దెనుంగు సేయుము నీకు భవబంధములు దెగునని యానతిచి తిరోహితుండయ్యె. అంత నే సమున్మీలిత నయనుండనై వెఱగు పడి చిత్తంబున.


* * *

1-14 మెఱుగు

1-14. సీసము

మెఱుగు చెంగట నున్న మేఘంబు కైవడి నువిద చెంగట నుండ నొప్పువాడు
చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమునఁ జిఱునవ్వు మొలచువాడు
వల్లీయుతతమాల వసుమతీజము భంగి బలు విల్లు మూఁపునఁ బరఁగువాఁడు
నీలనగాగ్ర సన్నిహితభానుని భంగి ఘనకిరీటము దలఁ గల్గువాఁడు
* * *

1-13 వచనము

1-13. వచనము

అని మదీయ పూర్వజన్మసహస్రసంచితతపః ఫలంబున శ్రీమన్నారాయణ కధా ప్రపంచ విరచనాకుతూహలుండనై యొక్క రాకానిశాకాలంబున సోమోపరాగంబురాకఁ గని సజ్జనానుమతంబున నభ్రంకషశుభ్ర సముత్తుంగ భంగయగు గంగకుం జని క్రుంకులిడి వెడలి మహనీయమంజుల పులినతలమందప మధ్యంబున మహెశ్వర ధ్యానంబు సేయుచుఁ గించిదున్మీలుత లోచనుండనై యున్నయెడ.

* * *

1-12 చేతులారంగ శివునిఁ

1-12. తేటగీతి

చేతులారంగ శివునిఁ బూజింపఁడేని, నోరునొవ్వంగ హరికీర్తి నుడువఁడేని
దయయు సత్యంబులోను గాఁదలఁపఁడేని, గలుగనేతికిఁ దల్లులకడుపుచేటు 

1-11 ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి

1-11. ఉత్పలమాల



ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరముఁ బాసి కాలుచె
సమ్మెట వాటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరా జోకఁడు భాగవతంబు జగధ్ధితంబుగన్


* * *

1-10 వచనము

1-10. వచనము

అని ఇష్టదెవతలం జింతించి దినకర కుమార ప్రముఖులం దలంచి ప్రధమ కవితా విరచన విద్యావిలాసాతిరేకి వాల్మీకి నుతయించి హయగ్రీవ దనుజకర పరిమిళిత నిగమనివహవిభాగ నిర్ణయనిపుణతాసముల్లాసుండగు వ్యాసునకు మ్రొక్కి శ్రీమహాభాగవతకధా సుధారసప్రయోగికి శుకయోగికి నమస్కరించి మృదుమధుర వచనరచన పల్లవితస్ధాణునకున్ బాణునకుం బ్రణమిల్లి కతిపయశ్లోకసమ్మోదితసూరు మయూరు నభినందించి మహాకావ్య కరణకళావిలాసుం గాళిదాసుంగొనియాడి కవికమల విసరరవిం భారవిం బొగడి విదళితాఘు మాఘు స్తుతియించి యాంధ్రకవితాగౌరవజనమనోహరి నన్నయ సూరిం గైవారంబుసేసి హరిహర చరణారవిందవందనాభిలాషిఁ దిక్కన మనీషిన్ భూషించి భక్తివిశేషిత పరమెశ్వరుండగు ప్రబంధపరమెశ్వరుం బ్రణుతించి మఱియు నితర పూర్వకవి జనసంభావనంబు గావించి వర్తమాన కవులకుం బ్రియంబు వలికి భావికవుల బహూకరించి యుభయకావ్యకరణదక్షుండనై.

* * *

1-9 హరికిన్ బట్టపు

1-9. మత్తేభము

హరికిన్ బట్టపు దేవి పున్నెములప్రోవర్ధంభు పెన్నిక్క చం
దురు తోఁ బుట్టువు భారతీగిరిసుతల్ తోనాడు పూఁబోణి తా
మరలం దుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భా 
సురత లేములు వాపు తల్లి సిరియిచ్చు నిత్యకళ్యాణముల్

1-8 అమ్మలఁగన్నయమ్మ

1-8. ఉత్పలమాల





శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేనరజతాచల కాశ ఫణీశ కుందమం
దార సుధాపయోధి సితతామరసామరవాహినీశుభా
కారత నొప్పు నిన్ను మదిఁ గానగ నెన్నడు గల్గు భారతీ! 


అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శారదచంద్రచంద్రికా
డంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా
చుంబిత దిగ్విభాగ శృతిసూక్తి వివిక్త నిజప్రభావ భా
వాంబరవీధి విశ్రుతవిహారిణి నన్ గృపఁ జూడు భారతీ!





* * *
అమ్మలఁగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడు పాఱడిపుచ్చి నయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా 
యమ్మ కృపాబ్ధి యీపుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్






* * *

1-7 పుట్టం బుట్ట

1-7. శార్దూలము
పుట్టం బుట్ట శరంబున మొలవ నంభొయానపాత్రంబున
నెట్టం గల్గను గాళిఁ గొల్వను బురాణింప దొరంకొంటి మీఁ
దెట్టే వెంతఁ జరింతుఁ దత్సరణి నాకీవమ్మ యో యమ్మ మేల్
పట్టు న్మానకుమమ్మ నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ దయాంభోనిధీ



* * *

1-6 క్షోనితలంబు

1-6. ఉత్పలమాల
క్షోనితలంబు నెన్నుదురు సోఁకఁగ మ్రొక్కినుతింతు సైకత
శ్రోణికిఁ జంచరీకచయసుందరవేణికి రక్షితానత
శ్రేణికిఁ దోయజాతభవ చిత్తవశీకరణైక వాణికి
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్యపాణికిన్.



* * *

1-5 ఆదరమొప్ప

1-4. వచనము 
అని నిఖిల ప్రధానదెవతావందనంబు సేసి



* * *

1-5. ఉత్పలమాల
ఆదరమొప్ప మ్రొక్కిడిదు నద్రిసుతాహృదయానురాగసం
పాదికి దోషభేదికిఁ బ్రపన్న వినోదికి విఘ్నవల్లికా
ఛ్ఛేదికి మంజువాదికి నశేషజగజ్జననందవెదికి
మోదకఖాదికి సమదమూషకసాదికి సుప్రసాదికి



* * *

1-3 ఆతత సేవ సేసెద

1-3. ఉత్పలమాల
ఆతత సేవ సేసెద సమస్తచరాచర భూతసృష్టివి
జ్ఞాతకు భారతీహౄదయసౌఖ్యవిధాతకు వేదరాసి ని
ర్ణేతకు దేవతానికరనేతకుఁ గల్మషజేతకు నత
త్రాతకు ధాతకు నిఖిలతాపసలోక సుభప్రదాతకు



* * *

1-2 వాలిన భక్తి మ్రొక్కెద

1-2. ఉత్పలమాల

వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికి దయా
శాలికి శూలికి శిఖరిజాముఖపద్మ మయూఖమాలికి
బాలశశాంకమౌలికిఁ గపాలికి మన్మధ గర్వపర్వతో
న్మూలికి నారదాది మునిముఖ్యమనస్సరసీరుహాళికి 




* * *

Thursday, March 03, 2016

1-1 శ్రీ కైవల్యపదంబుఁ

శ్రీ కైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్ లొకర
క్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవో
ద్రేక స్తంభకుఁ గేళిలొలవిలసద్దృగ్జాల సంభూతనా
నాకంజాతభవాండకుంభకు మహనందాంగనాడింభకున్.



...

గాత్రము: శ్రీ అనంత కృష్ణ గారు

* * *

ముందుమాట



పలికెడిది భాగవతమఁట, పలికించువిభుండు రామభద్రుండఁట నేఁ
బలికిన భవహరమగునఁట, పలికెద వేఱొండుగాథఁ బలుకఁగ నేలా.

తాత్పర్యము:
వ్రాయబడేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్భాగవతం. కరుణా సముద్రుడైన శ్రీరామచంద్రప్రభువేమో వ్రాయించేవాడుట. వ్రాసి నందువల్ల భవభందాలు పరిహారము అవుతాయిట. అంచేత భాగవతాన్ని వ్రాస్తాను. మిగతా వేవి వ్రాయను.




బమ్మెర పోతన



కవి పరిచయము

బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరు సంస్కృతములో ఉన్న శ్రీమద్భాగవతమును ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసినాడు. శ్రీమదాంధ్ర భాగవతములోని పద్యాలు వినని తెలుగు వాడు లేడంటే అతిశయోక్తి కాదు.

పోతన, శ్రీనాథ కవిసార్వభౌముడు సమకాలికులు, బంధువులు అనే సిద్ధాంతం ప్రాచుర్యంలో ఉంది కానీ ఈ సిద్ధాంతం నిజం కాదనే వారూ ఉన్నారు. వీరిమధ్య జరిగిన సంఘటనలగురించి ఎన్నో గాధలు ప్రచారములో ఉన్నాయి. పోతన వ్యవసాయము చేసి జీవనము సాగించినవారు. "పట్టునది కలమొ, హలమొ - సేయునది పద్యమో, సేద్యమో" అని "కరుణశ్రీజంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చమత్కరించిరి. 

కవిత్వమును రాజులకో, కలిగినవారికో అంకితమిచ్చి, వారిచ్చిన సొమ్ములు, సన్మానములు స్వీకరించుట అప్పటి సంప్రదాయము. కాసు కోసము ఆశపడి తన "బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకను" క్రూరులైన రాజుల పరము జేయుటకు పోతన అంగీకరింపలేదు. ఆయన తన కవిత్వము శ్రీరామునకే అంకితము చేసిన పరమ భాగవతోత్తములు.


పోతన కవిత్వములో భక్తి, మాధుర్యము, తెలుగుతనము, పాండిత్యము, వినయము కలగలిపి ఉంటాయి. అందులో తేనొలొలుకుతున్నవనేది ఎలా చూచినా అతిశయోక్తి కానేరదు. భావి కవులకు శుభము పలికి రచన ఆరంభించిన సుగుణశీలి ఆయన.


Courtesy: Wikipedia