పుణ్యంబై మునివల్లభగణ్యంబై కుసుమఫలనికాయోత్థిత సా
ద్గుణ్యమయి నైమిశాఖ్యారణ్యంబు నుతింపఁదగు సరణ్యంబులలోన్.
మఱియును; మధువైరి మందిరంబునుం బోలె మాధవీమన్మథమహితంబై; బ్రహ్మగేహంబునుం బోలె శారదాన్వితంబై; నీలగళసభా నికేతనంబునుం బోలె వహ్ని, వరుణ, సమీరణ, చంద్ర, రుద్ర, హైమవతీ, కుబేర, వృషభ, గాలవ, శాండిల్య, పాశుపత జటిపటల మండితంబై; బలభేది భవనంబునుం బోలె నైరావతామృత, రంభా గణికాభిరామంబై; మురాసురు నిలయంబునుం బోలె నున్మత్తరాక్షసవంశ సంకులంబై; ధనదాగారంబునుం బోలె శంఖ, పద్మ, కుంద, ముకుంద సుందరంబై; రఘురాము యుద్ధంబునుంబోలె నిరంతర శరానలశిఖాబహుళంబై; పరశురాము భండనంబునుం బోలె నర్జునోద్భేదంబై; దానవ సంగ్రామంబునుం బోలె నరిష్ట, జంభ, నికుంభ శక్తియుక్తంబై; కౌరవసంగరంబునుం బోలె ద్రోణార్జున కాంచనస్యందనకదంబ సమేతంబై; కర్ణుకలహంబునుం బోలె మహోన్నతశల్యసహకారంబై; సముద్రసేతుబంధనంబునుం బోలె నల, నీల, పనసాద్యద్రి ప్రదీపింతంబై; భర్గుభజనంబునుం బోలె నానాశోకలేఖా ఫలితంబై; మరుని కోదండంబునుం బోలెఁ బున్నాగశిలీముఖ భూషితంబై; నరసింహ రూపంబునుం బోలెఁ గేసరకరజకాంతంబై; నాట్యరంగంబునుం బోలె నటనటీ సుషిరాన్వితంబై; శైలజానిటలంబునుం బోలెఁ జందన, కర్పూర తిలకాలంకృతంబై; వర్షాగమంబునుం బోలె నింద్రబాణాసన, మేఘ, కరక, కమనీయంబై; నిగమంబునుం బోలె గాయత్రీ విరాజితంబై; మహాకావ్యంబునుం బోలె సరళ మృదులతా కలితంబై; వినతానిలయంబునుం బోలె సుపర్ణ రుచిరంబై; యమరావతీపురంబునుం బోలె సుమనోలలితంబై; కైటభోద్యోగంబునుం బోలె మధుమానితంబై; పురుషోత్తమ సేవనంబునుం బోలె నమృతఫలదంబై; ధనంజయ సమీకంబునుం బోలె నభ్రంకష పరాగంబై; వైకుంఠపురంబునుం బోలె హరి, ఖడ్గ, పుండరీక విలసితంబై; నందఘోషంబునుం బోలెఁ గృష్ణసార సుందరంబై; లంకా నగరంబునుం బోలె రామమహిషీవంచక సమంచితంబై; సుగ్రీవ సైన్యంబునుం బోలె గజ, గవయ, శరభ శోభితంబై; నారాయణస్థానంబునుం బోలె నీలకంఠ, హంస, కౌశిక, భరద్వాజ, తిత్తిరి భాసురంబై; మహాభారతంబునుం బోలె నేకచక్ర, బక, కంక, ధార్తరాష్ట్ర, శకుని, నకుల సంచార సమ్మిళితంబై; సూర్యరథంబునుం బోలె నురుతర ప్రవాహంబై; జలదకాల సంధ్యా ముహూర్తంబునుం బోలె బహువితత జాతిసౌమనస్యంబై యొప్పు నైమిశారణ్యం బను శ్రీవిష్ణుక్షేత్రంబు నందు శౌనకాది మహామునులు స్వర్లోకగీయమానుం డగు హరిం జేరుకొఱకు సహస్రవర్షంబు లనుష్ఠానకాలంబుగాఁ గల సత్త్రసంజ్ఞికం బైన యాగంబు సేయుచుండి; రం దొక్కనాఁడు వారలు రేపకడ నిత్యనైమిత్తిక హోమంబు లాచరించి సత్కృతుండై సుఖాసీనుండై యున్న సూతునిం జూచి.
మునుపటి తదుపరి